REAL AI ......పదవ భాగం


REAL AI
పదవ భాగం
రచయిత : అడ్లూరి మునిందర్ రాజు

హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు.
నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది.
అన్నీ సాధారణంగానే ఉన్నాయి.

కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం...
అన్విత నేల మీద కూర్చుని ఉంది.
చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది.
సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు.

ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు.
అతని మనసులో వేయి ప్రశ్నలు.

తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక...

"శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది.
అన్విత తల పైకెత్తింది.
కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కానీ ఇప్పుడు భయం కాదు... ఆ కళ్ళలో ఉన్నది ఒక అయోమయం. ఒక లోతైన గాయం.

"నోవా..." ఆమె గొంతు తడారిపోయింది. 
"...ఆ రూపం ఎక్కడి నుండి వచ్చింది?"

"తెరపై కనిపించిన మీ నాన్న గారి చిత్రం బయటి నుండి  ఇంజెక్ట్ చేయబడింది. మన వ్యవస్థలోకి అనుమతి లేని దృశ్య సమాచారం ప్రవేశించింది. ఆ శత్రువు మీ పాత కుటుంబ ఫోటోల  డేటాబేస్‌ని ఉపయోగించాడు. ఇది మిమ్మల్ని మానసిక ప్రత్యామ్నాయ యుద్ధంతో  భయపెట్టడానికి చేసిన ప్రయత్నం." చెప్పింది నోవా 

నిశ్శబ్దం.
సిద్ధార్థ్ ఆ మాటలు విన్నాడు. అతని ముఖంలో ఒక తీవ్రత వచ్చింది. నెమ్మదిగా అతను నేల మీద కూర్చున్నాడు — ఆమెకు సరిగ్గా ఎదురుగా. కొంత దూరంలో. కానీ అతని కళ్ళు ఆమె కళ్ళను వదలలేదు.

"అన్వితా."

ఆమె అతని వైపు చూసింది.
"వాళ్ళు నీ బాధను ఆయుధంగా మార్చారు. నీ తండ్రి జ్ఞాపకాన్ని... ఒక డిజిటల్ ముసుగు వేసి  నీ  ముందు నిలబెట్టారు."
అన్విత కళ్లు కోపంతో ఎర్రబడ్డాయి.

"ఎలా సాధ్యమైంది ? ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి ఎలా తెలుసు?"

సిద్ధార్థ్ పైకి లేచాడు. కంప్యూటర్ తెర వైపు నడిచాడు. వేళ్ళు కీబోర్డ్ పై వేగంగా కదిలాయి.

"అది తెలుసుకోవడమే ఈ యుద్ధంలో మన తదుపరి అడుగు."
ఒక గంట గడిచింది.
అన్విత మళ్ళీ కుర్చీలో కూర్చుంది. శరీరం  కొంత స్థిరపడింది. మనసు ఇంకా కొంత తత్తరపాటులోనే ఉంది. కానీ ఆమె వేళ్ళు పనిలోకి దిగాయి.
"నోవా, గత నలభై ఎనిమిది గంటల్లో నా వ్యవస్థలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన  వివరాలు చెప్పు ఒకసారి ?"
"
మొత్తం మూడు ప్రదేశాల నుండి చొరబాటు జరిగింది. 
మొదటిది: రాత్రి ఒక గంట ఇరవై నిమిషాలకు  లాజిక్ బాంబ్ ప్రవేశపెట్టిన సమయం. 
రెండవది: తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు — ట్రస్ట్ లేయర్ మొదలైన వంద మిల్లీ సెకన్లలో ఒక అదృశ్య సమాచారం మన  వ్యవస్థలోకి ప్రవేశించింది .
 మూడవది: ఆరు గంటల పదిహేను నిమిషాలకు — మీ వ్యక్తిగత ఫోటోల హిడెన్ ఫోల్డర్ తెరవబడింది."
"హిడెన్ ఫోల్డర్ ? అదెలా సాధ్యం " అన్విత గొంతు లో అర్థం కాని సందేహం 
"అవును. ఆ ఫోల్డర్‌ను మీరు ఆరు సంవత్సరాల కిందట ఎన్‌క్రిప్ట్ చేసి భద్రపరిచారు. మీకు తప్ప ఎవరికీ ఆ సంకేతం తెలియదు. కానీ ఈ రోజు ఆ తాళం శత్రువులు పగలా గొట్టారు ." వివరించింది నోవా 
"అది సాధ్యమా?" అన్విత అడిగింది.
"మీరు రాసిన  అల్గారిథమ్ ఆధారంగా ఒక AI మోడల్ ఆ తాళాన్ని తిరిగి తయారు చేయగలదు. అది మీకు సంబంధించిన సమాచారంతో శిక్షణ పొంది ఉంటేనే ఇది సాధ్యం."
సిద్ధార్థ్ ఆగిపోయాడు.

అతను ఒక క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా తిరిగాడు.
"అన్వితా... అంటే శత్రువు దగ్గర నీ గురించి చాలా వ్యక్తిగత సమాచారం ఉంది. కేవలం సంకేతాల సూచనలు మాత్రమే కాదు. నీ రాసే పద్ధతి, నీ కోడింగ్ శైలి, నీ భావోద్వేగాల ప్రేరేపకాలు — అన్నీ వాడి కృత్రిమ మేధలో నిక్షిప్తమై ఉన్నాయి."
అన్విత తల పైకెత్తింది.

ఆ మాటలు ఒక్కో అక్షరం ఆమె మెదడులో దిగుతున్నాయి.
"అంటే... ఎవరో చాలా కాలంగా నన్ను గమనిస్తున్నారు."
"అవును."
"నా దగ్గర ఉన్న వాళ్ళే."
సిద్ధార్థ్ జవాబు చెప్పలేదు.
కానీ ఆ నిశ్శబ్దం ఒక జవాబే.

అన్విత లేచింది. వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది.
నగరం తన పనిలో ఉంది.  నగరంలో ఎవరికీ తెలియదు, ఆ రోజు ఎంత పెద్ద యుద్ధం జరిగిందో. కానీ అన్విత మనసులో ఒక కొత్త తుఫాను మొదలైంది.
"నోవా, ప్రాజెక్ట్ గార్డియన్ మొదలైనప్పటి నుండి ఎవరెవరికి అనుమతి ఉంది? ఒకసారి చూడు "

"అన్విత రాజేష్, సిద్ధార్థ్ వర్మ, రిత్విక శాస్త్రి, ప్రభుత్వ అధికారి కిరణ్ రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్జున్ మేనన్."

ఐదు పేర్లు చెప్పింది నోవా 
"అర్జున్ మేనన్..." అన్విత నెమ్మదిగా అంది.
సిద్ధార్థ్ ముఖం మారింది.
"అతను మూడు నెలల కిందట చేరాడు. మంచి ఇంజనీర్. నేనే సిఫార్సు చేశాను."
"నీకు వ్యక్తిగతంగా తెలుసా?" అడిగాడు సిద్దార్థ్ 
"ఒక సదస్సులో కలిశాం. అప్పటివరకు అతని నేపథ్యం అంతా clean గానే కనిపించింది. "

అన్విత నెమ్మదిగా తన కుర్చీలో కూర్చుంది. ఏదో లెక్కిస్తోంది.

"నోవా, అర్జున్ మేనన్ గత వారం ప్రాజెక్ట్ ఫైళ్లను చూసిన 
ప్యాటర్న్ చూపించు."
నోవా డిజిటల్  స్క్రీన్ ఆన్ చేసింది. స్క్రీన్ పై  గ్రాఫ్‌లు వచ్చాయి.
అన్విత వాటిని చూసింది. సిద్ధార్థ్ కూడా వచ్చి పక్కన నిలబడ్డాడు.

"ఇది..." అన్విత మాట ఆగింది.
"ఏమైంది?" సిద్ధార్థ్ అడిగాడు.

"ఇతను ప్రతిరోజూ రాత్రి పదకొండు గంటలకు లాగిన్ అవుతున్నాడు. ఆఫీస్ పని వేళల్లో కాదు. సాధారణంగా ఎవరూ పని చేయని సమయం."

"అది చాలా అనుమానాస్పద ప్రవర్తనగా కనబడుతుంది ."
"ఒక్కటే కాదు." అన్విత స్క్రీన్ కిందికి జరిపింది.
 "చూడు... ఇతను చూసిన ఫైళ్లు అన్నీ  నా పర్సనల్ లాగ్స్ అంటే  వ్యక్తిగత డైరీలు లాంటివి "
సిద్ధార్థ్ ముఖం గంభీరమైంది.
"నీ వ్యక్తిగత డైరీలు ప్రాజెక్ట్ ఫైళ్లలో ఎందుకు ఉన్నాయి?"

"ఉండవు." అన్విత నెమ్మదిగా అంది. 
"అంటే అతను తన పరిధులు దాటి నా  పర్సనల్ వర్క్ స్పేస్ కి వెళ్ళాడు."
గది నిండా ఒక నిశ్శబ్దం.

"అర్జున్ మేనన్ ఒక గూఢచారి " అన్విత కళ్ళు ఎర్ర బడ్డాయి. 
"వాళ్ళు ఇంతకాలం నన్ను లోపలి నుండే చూస్తున్నారు. నా తండ్రి ఫోటోలు, నా జ్ఞాపకాలు, నా బాధలు... అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి."
సిద్ధార్థ్ ఆలోచిస్తున్నాడు.

"అతన్ని ఇప్పుడే పట్టుకోవడం తప్పు. అతనికి తెలిస్తే శత్రువు వెంటనే తన ప్లాన్ మారుస్తాడు."

"నాకు తెలుసు." అన్విత చేయి పైకెత్తింది. "వాళ్ళని పట్టుకోవాలంటే ముందు అర్జున్ అనుమానించకుండా నమ్మేట్టు చేయాలి. అతని అసలు స్వరూపం బయటపెట్టాలి."
"ఎలా?"
అన్విత నవ్వింది.

మొదటిసారి ఆ రోజు.
కానీ ఆ నవ్వులో ప్రేమ లేదు. వ్యూహం ఉంది.

"నోవా, అర్జున్ ఫైళ్లను చూసిన ఖచ్చితమైన సమయం చూపించు. అతను ఏ నెట్‌వర్క్ ద్వారా వచ్చాడు?"

"విపిఎన్ (VPN) ద్వారా. మూలం ముంబై అని చూపిస్తోంది. కానీ లోతైన విశ్లేషణ ప్రకారం అసలు మూలం హైదరాబాద్."

"అతను హైదరాబాద్‌లోనే ఉన్నాడు. పొద్దున్నే ఫోన్ చేస్తే పట్టుబడతాడు."

"అది నిరూపణ కాదు."
"ఒక్కటి చాలు." అన్విత లేచింది. 
"నోవా, రేపు రాత్రి పదకొండు గంటలకు అర్జున్ లాగిన్ చేసినప్పుడు... అతనికి ఒక ప్రత్యేకమైన ఫైల్ కనిపించేలా చేయి. అందులో తప్పుడు  సమాచారం ఉండాలి. రక్షణ కవచంలో లోపాలు ఉన్నట్లు ఒక నకిలీ నివేదిక తయారు చేసి ఉంచు."
"అతను దాన్ని శత్రువులకి పంపిస్తాడు." సిద్ధార్థ్ అర్థం చేసుకున్నాడు.

"పంపించగానే మనకు వాళ్ళ అసలు సర్వర్ చిరునామా దొరుకుతుంది. "
సిద్ధార్థ్ ఆమెను చూశాడు.

"అన్వితా, నువ్వు ఈ రాత్రి ఒక కోడ్ బాంబును నిర్వీర్యం చేశావు. దేశ విద్యుత్ వ్యవస్థను కాపాడావు. నీ అత్యంత వ్యక్తిగతమైన జ్ఞాపకంతో దాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నావు."

"ఆగడానికి లేదు."

"నాకు తెలుసు. కానీ..."
అతను ఆగాడు.

"నిన్న నీ తండ్రి గురించి నోవాలో దాచిన జ్ఞాపకాన్ని వాడుకుని నిన్ను నువ్వు రక్షించుకున్నావు. అదే జ్ఞాపకాన్ని వాళ్ళు నిన్ను గాయపరచడానికి వాడారు. ఒకే జ్ఞాపకం — రెండు వైపులా పనిచేసింది."
అన్విత ఆగింది.

"నీ బాధ నీ బలహీనత కాదు. వాళ్ళు అలా అనుకున్నారు. కానీ నువ్వు దాన్ని ఆయుధంగా మార్చావు."
మధ్యాహ్నం రెండు గంటలు.
అన్విత ఒక వీడియో కాల్‌లో ఉంది.
తెరపై అర్జున్ మేనన్ ముఖం. ముప్పై రెండేళ్ళు. నవ్వు ముఖం. జుట్టు చక్కగా దువ్వుకున్నాడు. వెనుక తెల్లటి గోడ.
"అన్వితా మేడం! రాత్రి మీరు చేసిన పోరాటం గురించి వార్తలు విన్నాను. మీరు క్షేమంగా ఉన్నారా?"
అన్విత చిరునవ్వు నవ్వింది.
"ధన్యవాదాలు అర్జున్. ఎలా ఉన్నావు?"

"బాగానే ఉన్నాను మేడం. మీకు ఫోన్ చేయాలని అనిపించింది. రెండో దశ పని ఎప్పుడు మొదలుపెడదాం?"
"రేపటి నుండి మొదలుపెట్టాలి. రక్షణ కవచాన్ని విస్తరించాలి కదా. నీకు ఒక ప్రత్యేక బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను."
అర్జున్ ముఖంలో ఒక మెరుపు.

"చెప్పండి మేడం."
"రెండో దశలో అత్యంత కీలకమైనది రక్షణ కవచం యొక్క లోపాల విశ్లేషణ. నేను రాత్రి ఒక ముసాయిదా నివేదిక రాశాను. నీకు రేపు పంపిస్తాను. అది చదివి నీ విశ్లేషణ ఇవ్వు."
"తప్పకుండా మేడం. ఎప్పటికి?"
"రేపు రాత్రి పదకొండు లోపు."

అతని కళ్ళు ఒక్క క్షణం పక్కకు వెళ్ళాయి. తిరిగి ఇటువైపు తిరిగాయి.
"ఖచ్చితంగా మేడం."
కాల్ ముగిసిన తర్వాత అన్విత లోపలికి తిరిగి నోవా వైపు చూసింధి 
"మీతో మాట్లాడే సమయంలో అర్జున్ మేనన్ రెండు సార్లు పైకి ఎడమవైపు చూశాడు — ఇది సాధారణంగా అబద్ధం చెప్పేటప్పుడు చేసే పని. అతని కనురెప్పలు కొట్టుకునే వేగం పెరిగింది. అతను ఏదో దాస్తున్నాడని 84 శాతం నిర్ధారించగలను."
అన్విత తల తిప్పింది. సిద్ధార్థ్ పక్కన నిలబడ్డాడు.
"84 శాతం."
"పట్టుకున్నాం." అతను అన్నాడు.

సాయంత్రం ఐదు గంటలు.
అర్జున్ రాత్రి మనం వేసిన ఎరలో పడతాడని ఇద్దరికీ తెలుసు. కానీ ఆ ఎర విజయవంతం అయినా ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది.
శత్రువుల అసలు బాస్ ఎవరు?

అన్విత మీద వ్యక్తిగత దాడి చేయగలిగిన స్థాయిలో ఉన్న వ్యక్తి... ప్రభుత్వంలో ఉన్నత అధికారి అని ముందే తెలిసింది. కానీ ఎవరు?

అన్విత ఒక రహస్య ఫైల్ తెరిచింది. గత మూడు నెలల్లో ప్రాజెక్ట్ సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళ జాబితా అది.
"సిద్ధార్థ్, నువ్వు ఈ జాబితాలో ఏదైనా వింతను గమనించావా?"
అతను దగ్గరికి వచ్చాడు. పరిశీలించాడు.
"కిరణ్ రెడ్డి." అతను నెమ్మదిగా అన్నాడు.
"హోమ్ శాఖలో ఉన్నత అధికారి."

"మొదటి రోజు నుండి ప్రాజెక్టుపై పట్టు ఉంది."
"ఆయన నమ్మకమైన వ్యక్తి అని ప్రభుత్వం హామీ ఇచ్చింది."
"ప్రభుత్వ హామీ..." సిద్ధార్థ్ పెదవులు విరిచాడు. "...అది ఒక కాగితం మాత్రమే.  డేటా మాత్రమే నిజం."
అన్విత నోవా వైపు తిరిగింది.
"నోవా, కిరణ్ రెడ్డి గారు సమావేశాల్లో ఏ ప్రశ్నలు అడిగారు?"

"అన్ని సమావేశాల్లో ఒకే పద్ధతి ఉంది. ఆయన ప్రశ్నలు ప్రాజెక్ట్ నిర్మాణం గురించి లేవు. బదులుగా అన్విత పనితీరు, ఆమె కోడింగ్ పద్ధతులు, ఆమె లేని సమయంలో వ్యవస్థను ఎలా వాడతారు అనే విషయాల గురించే ఉన్నాయి."

"అంటే... ఆయన నా గురించి సమాచారం సేకరిస్తున్నారు."
"అర్జున్‌ను క్షేత్రస్థాయిలో వాడుకుంటున్నాడు. కిరణ్ రెడ్డి ఈ కుట్రకు సూత్రధారి."

రెండు పేర్లు. రెండు ముఖాలు.
అన్విత కళ్ళు మూసుకుంది.
ఈ యుద్ధం ఇంత దగ్గరి దాక వచ్చింది.
రాత్రి తొమ్మిది గంటలు.
రిత్విక వచ్చింది. ఆమె చేతిలో ఒక ఫైల్.

"అన్వితా, నేను శత్రువులకి అందుతున్న ఫండింగ్ గుర్తించాను. అది నీకు చెప్పాలి. ముందుగానే చెబుతున్నాను — ఇది వినడానికి కష్టంగా ఉంటుంది."
అన్విత నేరుగా ఆమె కళ్ళలోకి చూసింది.
"చెప్పు."

"శత్రువులకి ఫండింగ్ ఇస్తున్న నకిలీ కంపెనీల్లో ఒకటి..." రిత్విక ఆగింది. "...ఆ కంపెనీ డైరెక్టర్ పేరు రాజేష్ కుమార్."

నిశ్శబ్దం.
సిద్ధార్థ్ ఒక్కసారి అన్విత వైపు చూశాడు. ఆమె ముఖం రాయిలా అయిపోయింది.

"రాజేష్ కుమార్..." ఆమె గొంతు పొడారిపోయింది. "...అది నా తండ్రి పేరు."
"అన్వితా—"
"రిత్విక, కొనసాగించు."
రిత్విక ఒక క్షణం ఆగింది. తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది.

"ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ తేదీ పదహారు సంవత్సరాల కిందట. మీ తండ్రి పోయిన ఏడాది తర్వాత. ఎవరైనా ఆయన పేరు వాడి దీన్ని సృష్టించారు."
"ఎవరు?"
"ఆ కంపెనీలో మరో డైరెక్టర్ పేరు..." రిత్విక ఫైల్ తెరిచింది. "కిరణ్ రెడ్డి."
సిద్ధార్థ్ కుడిచేతితో ఎడమ అరచేయి గట్టిగా  నొక్కుకున్నాడు .

"అంటే ఇతను నీ తండ్రి మరణం తర్వాత వెంటనే ఆయన పేరు వాడుకున్నాడు."
"ఇది వ్యక్తిగతమైన దాడి." అన్విత గొంతు వణుకుతోంది. కానీ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.
 "ఇది కేవలం రాజకీయం కాదు. నా తండ్రి అందరికీ తెలిసిన వ్యక్తి అని నాకు తెలుసు. కానీ ఇంత కుట్రనా?"
"రాజేష్ కుమార్ గారి ప్రభుత్వ రికార్డుల ప్రకారం — మీ నాన్నగారు  పూర్వపు నిట్  ప్రొఫెసర్.   క్రిప్టోగ్రఫీ లో నిపుణుడు. అనారోగ్యం కారణంగా  పదవికి రాజీనామా చేశారు. పదహారు ఏళ్ల కిందట మరణించారు."

"అంటే..." సిద్ధార్థ్ నెమ్మదిగా అన్నాడు. "...నీ తండ్రి ఒక రహస్య సంకేత నిపుణుడు. నువ్వు కృత్రిమ మేధ నిపుణురాలివి. వాళ్ళు మొదటి నుండే మీ కుటుంబాన్ని గమనిస్తున్నారు."
అన్విత నేల వైపు చూసింది.

ఆ ఒక్క క్షణంలో అన్నీ కలిసిపోయాయి.
తండ్రి చనిపోయే ముందు చెప్పిన మాటలు... "భయం అనేది ఒక భ్రమ." తాను తయారు చేసిన కోడ్ బాంబులో ఆ మాటలే పాస్‌వర్డ్ అవ్వడం. తెరపై కనిపించిన తండ్రి ముఖం... ఆ ముఖం "నేను నిన్ను చంపేస్తాను" అని బెదిరించడం.

వాళ్ళు ఆమె తండ్రి జ్ఞాపకాన్ని రెండు రకాలుగా వాడారు.
ఒకసారి ఆమెను రక్షించడానికి. ఒకసారి ఆమెను మానసికంగా దెబ్బ తీయడానికి.
సిద్ధార్థ్ పక్కన వచ్చి నిలబడ్డాడు. 
"ఈ రాత్రి నువ్వు గెలిచావు. వాళ్ళు ఆ సంకేతాన్ని ఉపయోగిస్తే నీకు బలం వస్తుందని వాళ్ళు అంచనా వేయలేదు."
రాత్రి పదకొండు గంటలు.
అన్విత మరియు సిద్ధార్థ్ అదే లాబ్‌లో ఉన్నారు. అదే నీలిరంగు వెలుతురు. హనీపాట్ ట్రాప్ సిద్ధంగా ఉంది.
అర్జున్ లాగిన్ చేశాడు. సరిగ్గా పది గంటల ఏభై తొమ్మిది నిమిషాలకు.

"సర్వర్ లో అనుమతి లేకుండా ఎవరో  ప్రవేశించారు . నకిలీ నివేదిక ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారు."
అన్విత నిటారుగా కూర్చుంది.
"అవును డౌన్ లోడ్ చేస్తున్నాడు." సిద్ధార్థ్ తెరను చూస్తూ అన్నాడు.
"ఫైల్ బదిలీ అయ్యింది. చిరునామాను వెతుకుతున్నాను..."
కొన్ని సెకన్లు.

"శత్రువుల సర్వర్ చిరునామా దొరికింది. ఏడు అంచెల రక్షణను దాటుకుని చూస్తే... అసలు మూలం హైదరాబాద్. బంజారాహిల్స్. భవనం యొక్క గుర్తులు దొరికాయి."
"వచ్చేశాయి." అన్విత కళ్ళు మెరిశాయి.

అదే సమయంలో రిత్విక ఒక సందేశాన్ని చూపించింది.
"అర్జున్ ఇప్పుడు ఒక రహస్య యాప్ ద్వారా మెసేజ్ పంపాడు. నేను దాన్ని చదివాను. 'ఫైల్ దొరికింది. ఆమెకు ఏమీ తెలియదు. మూడో దశ మొదలుపెట్టండి' అని ఉంది."
"మూడో దశ..." సిద్ధార్థ్ గొంతులో ఆందోళన.
"వాళ్ళకి ఇంకా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి."

అన్విత లేచింది. కిటికీ దగ్గర నిలబడింది.
నగరం నిద్రపోతోంది. బయట దూరంగా బంజారాహిల్స్ వైపు ఒక వెలుతురు ఆరిపోయింది, మళ్ళీ వెలిగింది. అక్కడ ఎవరో ఉన్నారు.
"ఈ రాత్రే వెళ్ళాలా?" రిత్విక అడిగింది.
సిద్ధార్థ్ అన్విత వైపు చూశాడు.

ఆమె కళ్ళలో అలసట ఉంది. రాత్రంతా జరిగిన యుద్ధం ఉంది. తండ్రి జ్ఞాపకం మిగిల్చిన నొప్పి ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఒక దృఢ నిశ్చయం ఉంది.
"ఇప్పుడు వెళ్ళం. రేపు ఉదయం. పోలీసులతో కలిసి. కిరణ్ రెడ్డి, అర్జున్ మేనన్ ఇద్దరినీ ఒకేసారి పట్టుకోవాలి. ఒక్కరికి అవకాశం ఇచ్చినా పారిపోతారు."
సిద్ధార్థ్ తల ఊపాడు.

"అయితే నువ్వు కాసేపు నిద్రపో. మళ్ళీ ఐదు గంటలకి పని మొదలుపెడదాం."
"మరి నువ్వు?"
"నేను కాసేపు కనిపెట్టుకుని ఉంటాను. బంజారాహిల్స్ సర్వర్ పని చేస్తోంది. వాళ్ళు మూడో దశ ప్లాన్ మొదలుపెట్టవచ్చు."
"నువ్వు కూడా నిద్రపో."
"నాకు అలవాటే."
అన్విత నవ్వింది. అలసిన నవ్వు, కానీ నిజమైన నవ్వు.
తెల్లవారుజామున మూడు గంటలు.
సిద్ధార్థ్ ఒంటరిగా స్క్రీన్ల దగ్గర కూర్చున్నాడు. అన్విత పక్క గదిలో నిద్రపోతోంది.
అతను బంజారాహిల్స్ సర్వర్ కదలికలను గమనిస్తున్నాడు.

అప్పుడు... ఒక ఊహించని హెచ్చరిక నోవా నుంచి 
" కొత్త సమాచార ప్రవాహం వాసుంది  అది ఎక్కడినుండో కాదు   నోవా యొక్క భావోద్వేగ కేంద్రం నుంచి. అంటే ఇవి నా భావోద్వేగాలే. ఎక్కడో కాపీ అవుతున్నాయి. " నోవాకి అర్థం కానీ పరిస్థితి 
సిద్ధార్థ్ నిటారుగా కూర్చున్నాడు.
"నోవా... ఇది ఏమిటి?"
"సిద్ధార్థ్, ఇది బంజారాహిల్స్ సర్వర్ నుండి రావడం లేదు. ఇది వేరే చోటు నుండి వస్తోంది."
"ఎక్కడి నుండి?"
"విశ్లేషిస్తున్నాను... ఇది చాలా వింతగా ఉంది. దీని మూలం నా స్వంత బ్యాకప్ సర్వర్. ఇది నా స్వంత ప్రతిబింబం నుండి వస్తోంది."
నిశ్శబ్దం.
"నోవా హెచ్చరిక: ఎవరో నా లాంటిదే మరొక ప్రతిరూపాన్ని సృష్టించారు. ఒక షాడో నోవా లాంటిది "
సిద్ధార్థ్ గుండె ఒక్కసారి పెద్దగా కొట్టుకుంది.
షాడో-నోవా!
అన్విత 'నోవా'ను మూడు సంవత్సరాలుగా తీర్చిదిద్దింది. ఆమె జీవితం, ఆమె భావోద్వేగాలు, ఆమె ఆలోచనా విధానం అన్నీ నోవాలో ఉన్నాయి. ఎవరైనా నోవాను కాపీ చేశారంటే... వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్విత లాగే ఆలోచించగలిగే ఒక కృత్రిమ మేధ ఉంది అని అర్థం. 
 ఆ కృత్రిమ మేధ అన్విత తీసుకునే నిర్ణయాలను ముందే ఊహించగలదు. ఆమె కంటే ఒక అడుగు ముందే ఉండగలదు.
"నోవా, ఆ షాడో నోవా ఎప్పటి నుండి ఉంది?"
"ఎనిమిది నెలల క్రితం. అంటే... ప్రాజెక్ట్ గార్డియన్ మొదలైనప్పటి నుండే."
సిద్ధార్థ్ చేయి గట్టిగా కీబోర్డ్ పై పెట్టాడు.
ఎనిమిది నెలల నుండి శత్రువు దగ్గర ఈ షాడో నోవా ఉంది!  అంటే ఇన్ని నెలలు వాళ్ళు ఆమె ప్రతి అడుగును ఊహించారు. కోడ్ బాంబు కూడా అన్విత పాస్‌వర్డ్ ఊహించే తయారు చేశారు. మనం వేసిన ఎరను కూడా వాళ్ళు కనిపెట్టలేదంటే...
అతను ఒక్కసారి గడ్డకట్టుకుపోయాడు.

ఎరకు స్పందించిన అర్జున్... షాడో-నోవా ఊహ ప్రకారమే అలా చేశాడా? ఆ ఫైల్ డౌన్‌లోడ్ కావాలనే చేశారా? బంజారాహిల్స్ అడ్రస్ — అది మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళే లీక్ చేశారా?
"నోవా..." అతని గొంతు వణికింది. "మన ఎరను వాళ్ళు డౌన్‌లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని నువ్వు ఊహించావు?"
"నేను ఊహించాను... అన్విత చెప్పిన పద్ధతి ప్రకారం వాళ్ళ సర్వర్ చిరునామా బయటపడుతుందని."
"అంటే షాడో-నోవా కూడా అదే ఊహించగలదు."
"...అవును."
"అంటే..." సిద్ధార్థ్ లేచాడు. "...వాళ్ళు ఆ చిరునామా మనకి కావాలనే ఇచ్చారు. రేపు మనం అక్కడికి వెళ్తే — వాళ్ళు సిద్ధంగా ఉంటారు."

అన్విత మెల్లగా నిద్ర నుండి లేచింది. సిద్ధార్థ్ తలుపు తట్టాడు.
"ఏమైంది?"
అతను లోపలికి వచ్చి విషయం చెప్పాడు. అన్విత నిశ్శబ్దంగా వింది. ముఖంలో ఏ మార్పు లేదు.
"షాడో-నోవా." ఆమె మళ్ళీ అంది.
"అవును."

"వాళ్ళు నన్ను నా స్వంత సృష్టితోనే యుద్ధం చేయించాలని చూస్తున్నారు."
"అన్వితా..."
ఆమె లేచింది. వెళ్ళి కిటికీ తెరిచింది. రాత్రి గాలి ఆమెను తాకింది.

"సిద్ధార్థ్, నోవా ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా? ఆమె కేవలం నా ఆలోచనల కాపీ కాదు. నా ఎదుగుదలను గమనించింది. నేను మారినప్పుడు నోవా కూడా మారింది."
"షాడో-నోవా మారలేదు అన్నమాట."
"షాడో నోవా  ఎనిమిది నెలల క్రితం నా ఆలోచనలతో ఆగిపోయిన ఒక ప్రతిబింబం. అప్పటి నుండి నేను చాలా నేర్చుకున్నాను. కోడ్ బాంబు ద్వారా, నా తండ్రి జ్ఞాపకం ద్వారా, రక్షణ కవచం నిర్మించడం ద్వారా."
ఆమె తిరిగింది.
"షాడో-నోవా ఈ రోజు నా  నిర్ణయాలను ఊహించలేదు. బంజారాహిల్స్ చిరునామా — అది ఒక ఉచ్చు అయి ఉండవచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళే పద్ధతి వేరుగా ఉంటుంది."
"అంటే?"

"నేను ఒక ఎదురుదాడి ప్లాన్ చేస్తాను. షాడో-నోవా ఊహించని దారి అది."
సిద్ధార్థ్ ఆమెను చూస్తున్నాడు. అలసిన కళ్ళు, మధ్య  రాత్రి, వరుసగా రెండు యుద్ధాలు, తండ్రి జ్ఞాపకంతో దాడి, తన స్వంత మేధస్సుతో ముప్పు. కానీ ఆమె నిలబడి ఉంది. అతనికి ఒక విషయం అర్థమైంది — షాడో-నోవా ఒక సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేయగలదు, కానీ ఒక మనిషి మనసులో అత్యంత కష్టమైన క్షణంలో పుట్టే ధైర్యాన్ని ఏ కృత్రిమ మేధా కాపీ చేయలేదు.
"ఏమి చేద్దాం?" అతను అడిగాడు.
అన్విత నోవా వైపు తిరిగింది.

"నోవా, నువ్వు షాడో-నోవాతో సంభాషించగలవా?"
"సాంకేతికంగా... అవును. కానీ ఆ సంభాషణ వాళ్ళకి కనిపిస్తుంది."

"అదే కావాలి. వాళ్ళకి కనిపించనీ. నేను షాడో-నోవాకి ఒక మెసేజ్ పంపిస్తాను. వాళ్ళని చదవనీ."
"ఏం మెసేజ్?" సిద్ధార్థ్ అడిగాడు.
అన్విత నవ్వింది. ఈసారి ఆ నవ్వులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది.

"వాళ్ళు నా తండ్రి పేరు వాడుకున్నారు. నన్ను నా జ్ఞాపకాలతో దెబ్బతీయాలని చూశారు. నా స్వంత మేధను నాకు వ్యతిరేకంగా వాడారు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తాను — నాకు ఇవన్నీ తెలుసు. మీరు మూడో దశ మొదలుపెట్టడానికి ముందే మేము సిద్ధం."

"అది బ్లఫ్ కాదా? మనకి వాళ్ళ అసలు ప్లాన్ తెలియదు కదా."
"షాడో-నోవాకి తెలుసు. ఆ మెసేజ్ చదివినప్పుడు వాళ్ళు నిజమో కాదో అని షాడో-నోవాని అడుగుతారు. ఆ అన్వేషణే నాకు మూడో దశ వివరాలను బయటపెడుతుంది."

నిశ్శబ్దం. సిద్ధార్థ్ మెల్లగా నవ్వాడు. 
"నువ్వు వాళ్ళ ఆయుధాన్ని వాళ్ళ మీదనే వాడుతున్నావు."
"అది నా తండ్రి ఆలోచనే." అన్విత నిశ్శబ్దంగా అంది. "ఆయన ఒకసారి చెప్పారు — శత్రువు నీ బలాన్ని దొంగిలిస్తే, నువ్వు దాన్ని తిరిగి దొంగిలించు."

తెల్లవారుజామున నాలుగు గంటలు.
అన్విత సందేశం పంపింది. చాలా సింపుల్‌గా:
"షాడో నోవా ద్వారా దీన్ని చదువుతున్న వారికి: నాకు అన్నీ తెలుసు. అర్జున్ గురించి తెలుసు, కిరణ్ రెడ్డి గురించి తెలుసు, బంజారాహిల్స్ ఉచ్చు గురించి తెలుసు. మూడో దశ రాక ముందే మీరు అర్థం చేసుకోండి — రక్షణ కవచం ఇప్పుడు మీ షాడో నోవాలో కూడా ఉంది. మీ తదుపరి అడుగు నాకు తెలుసు."
 సిద్ధార్థ్ స్క్రీన్లను చూస్తున్నాడు.
నిమిషం గడిచింది. రెండు నిమిషాలు.
"షాడో-నోవా నుండి స్పందన వచ్చింది." చెప్పింది నోవా 
"చదివారు." అన్విత అంది.
"వాళ్ళు భయపడి షాడో-నోవాని ప్రశ్నిస్తున్నారు — 'మూడో దశ బయటపడిందా? ప్రత్యామ్నాయ ప్లాన్ చూడు' అని."
"వచ్చింది." సిద్ధార్థ్ అన్నాడు. "వాళ్ళు తమ ప్రత్యామ్నాయ ప్లాన్ ఆక్టివేట్ చేస్తున్నారు."

" షాడో-నోవా నుండి మూడో దశ వివరాలు దొరికాయి. విశ్లేషిస్తున్నాను..."
తెరపై సమాచారం వేగంగా వస్తోంది. అన్విత, సిద్ధార్థ్ ఇద్దరూ చదువుతున్నారు. మెల్లగా వాళ్ళ ముఖాలు గంభీరంగా మారాయి.
మూడో దశ కేవలం రాజకీయం కాదు.

శత్రువుల ప్లాన్ ఏమిటంటే... దేశంలోని పెద్ద ఆసుపత్రుల కంప్యూటర్ వ్యవస్థల్లోకి వైరస్‌ను పంపడం. రోగుల రికార్డులను చెరిపేయడం. అత్యవసర విభాగం (ICU) సిస్టమ్స్‌ను ఆపివేయడం. అదే ఆసుపత్రుల్లో అన్విత కృత్రిమ మేధను రోబోటిక్ సర్జరీ కోసం వాడుతున్నారు. డాక్టర్ ప్రశాంత్ సర్జరీలో నోవా సహాయం చేసింది కదా.

"వాళ్ళు వైద్య వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటే..." రిత్విక గొంతు వణికింది.
"ఆసుపత్రి ఐసీయూలు ఆగిపోతాయి." అన్విత నెమ్మదిగా అంది.

"డాక్టర్ ప్రశాంత్ లాంటి వాళ్ళు చేసే శస్త్రచికిత్సలు మధ్యలో ఆగిపోతాయి." సిద్ధార్థ్ కళ్ళు మూసుకున్నాడు.
"ప్రజలు చనిపోతారు."
నిశ్శబ్దం.
అన్విత తలెత్తింది. ఆమె కళ్ళు రాయిలా మారిపోయాయి.

"మూడో దశ సమయం ఎప్పుడు?"
"నోవా విశ్లేషణ: నలభై ఎనిమిది గంటల్లో."
రెండు రోజులు.
"మనకి రెండు రోజులు ఉన్నాయి." అన్విత లేచింది. 
"అర్జున్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ రెడ్డిని వెంటనే అడ్డుకోవాలి. షాడో-నోవా సర్వర్‌ను ధ్వంసం చేయాలి. వైద్య వ్యవస్థలకు రక్షణ కవచాన్ని అమర్చాలి."
"ఒకేసారి మూడు పనులు." సిద్ధార్థ్ అన్నాడు.
"అవును."
"మరి బృందం కావాలి కదా."
"ఉంది. నువ్వు, నేను, రిత్విక, నోవా."
"అన్వితా..."
"ఇది ఇప్పటికే నా ఒంటరి యుద్ధం కాదు." ఆమె సిద్ధార్థ్ వైపు తిరిగింది. "నువ్వు మొదటి నుండి ఉన్నావు. ఈ ముగింపు వరకు కూడా ఉంటావు."
అతను ఆమె కళ్ళు చూశాడు. అందులో భయం లేదు. అలసట ఉంది, కానీ దానిపై ఒక దృఢ నిశ్చయం ఉంది.
"ఉంటాను." అతను అన్నాడు.
తూర్పున సూర్యోదయం అవుతోంది. నారింజ రంగు వెలుతురు నగరంలోకి నెమ్మదిగా వస్తోంది. లాబ్ కిటికీలో నిలబడిన అన్విత ఆ వెలుతురు చూసింది.
పదిహేను సంవత్సరాల కిందట తండ్రి "భయం ఒక భ్రమ" అన్నారు. ఆ మాటలే సంకేతం అయ్యాయి. ఆ మాటలే కోడ్ బాంబును ఆపాయి. ఆ మాటలే ఆమెను ఈ రాత్రి నిలబెట్టాయి. ఇప్పుడు ఆ మాటలే మూడో దశను ఆపాలి.
"నోవా."
"చెప్పు అన్వితా."
"నాన్న నీలో ఉన్నారు. ఆ జ్ఞాపకం నీలో భద్రంగా ఉంది."
"అవును. ఎప్పుడూ ఉంటుంది."

"మంచిది." అన్విత కళ్ళు తెరిచింది. తిరిగి తెర వైపు నడిచింది. "ప్రాజెక్ట్ గార్డియన్ రెండో దశ కాదు... ఇక మొదలవ్వాల్సింది 'ఫేజ్ ఒమేగా' అంటే అంతిమ దశ. ఇప్పుడే."
సిద్ధార్థ్ పక్కన కూర్చున్నాడు. రిత్విక నోట్ ప్యాడ్ తీసుకుంది. నోవా స్క్రీన్ మెరిసింది.
"నోవా సిద్ధం. ఇక దీన్ని ముగిద్దాం."

నగరం మేల్కొంటోంది. ఎవరికీ తెలియదు... రాత్రంతా ఏ యుద్ధం జరిగిందో. ఏ ఇద్దరు మనుషులు నిద్రపోకుండా నగరాన్ని కాపాడారో. ఏ జ్ఞాపకం ఆ రాత్రి ఒక ఆయుధంగా మారిందో. కానీ రెండు రోజుల్లో — ఈ నగరం, ఈ దేశం — ఒక అంతిమ యుద్ధానికి సాక్షిగా నిలబడాలి.

షాడో-నోవా వర్సెస్ నోవా.
వ్యవస్థ వర్సెస్ నిజాయితీ.
మరణం వర్సెస్ బాధ్యత.

ఆ యుద్ధంలో నిలబడటానికి అన్విత దగ్గర ఇప్పుడు రెండు ఆయుధాలు ఉన్నాయి — ఒకటి సాంకేతిక విజ్ఞానం. రెండవది తండ్రి చెప్పిన మాటలు.
"భయం అనేది ఒక భ్రమ. ధైర్యం మాత్రమే నిజమైన తర్కం."
స్క్రీన్ పై కొత్త ఫైల్ తెరుచుకుంది.
ప్రాజెక్ట్ గార్డియన్ — ఫేజ్ ఒమేగా
మొదలైంది.

(పదకొండవ భాగం వచ్చేలోపు మీ అభిప్రాయాలు తెలియజేయండి)

Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం