REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

చారి సర్...ఓ మధుర జ్ఞాపకం





సముద్రం లో ఒక నీటి చుక్క ...

విలువ లేదనుకుంటాము.

ఆ నీటిచుక్కే బీడుబారిన పొలాలను...పంటలు పండించడానికి ఆవిరై కిందపడే వాన చినుకు కావొచ్చుగా..

అలా విద్యార్థుల ఎడారి మనసులను హరితవనం చేయడానికే మా దగ్గర కొచ్చాడు మా చారి సర్..తాండ్యాల రామచంద్రాచారి గారు. చెన్నూరు వాస్తవ్యులు.

సముద్రపు అలలను ఎంత ఆస్వాదిస్తామో..ఆయన పాఠాలను అలా మైమర్చిపోయి వింటాము...ఇక్కడ ఉన్న మన మనసుని ఎక్కడో జ్ఞానాన్వేషణ(జనరల్ నాలెడ్జ్)  కొరకు పంపి ఆ వెంటనే మనం అన్వేషించిన విషయాన్ని తోటి విద్యార్థులకు పంచమని చెప్పే స్ఫూర్తి ఆయన నేర్పిందే...

బాగా చదివే విద్యార్థులను మాత్రమే ప్రోత్సహించడం ఆయన తత్వం కాదు. చదువులో వెనకబడి వెనక బెంచి లో దాక్కున్న విద్యార్థి లో సైతం సృజనాత్మకత అనే మొక్క నాటడం ..ఆయన వల్లనే అవుతుంది.

సమాజానికి సేవ చేసి అసువులు బాసిన ఒక నాయకుని మరణం మనల్ని ఎంత కలచి వేస్తుందో ..ఒక మంచి ఉపాధ్యాయుని ఎడబాటు కూడా మనలో అంత వేదన నింపుతుంది.

ఆయన దగ్గర భాష నేర్చుకున్న వారెందరో ఎన్నో రంగాల్లో స్థిరపడ్డా ఆయన జ్ఞాపకాలు వదలని వారెందరో ఉన్నారు..నిజానికి తాను నేర్పింది భాష కాదు..ఒక జీవితం...జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకోవడానికి నేర్పిన జ్ఞానం.


మనం అనుకుంటాం. ఇప్పటి పిల్లలకు వినయ విధేయతలు లేవని. అప్పుడు గురువుల పట్ల మనం అంకితభావంతో ఉండే వాళ్లమని. కానీ బాగా తరచిచూస్తే విద్యార్థి జీవితం లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాలతో మమేకమయ్యే ఓపిక, సహనం ఇప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులకు ఉన్నాయి...

మనకు చదువు నేర్పిన ఎంతోమంది ఉపాధ్యాయుల మరణవార్త మనం తేలిగ్గా తీసుకున్నాం. వాళ్ళ subjects లో వాళ్లు చక్కని బాధ్యత నిర్వహించారు. అయినా మనం వాళ్ళు దూరం కావడం తేలిగ్గానే తీసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు కలత చెందుతున్నాం అంటే...అదే చారి సర్


పాఠాలు చెప్పి వదిలివేయడం కాదు.ఈ పాఠం నీ జీవితం లో ఎక్కడ ఉపయోగిస్తావో  తెలుసుకొమ్మని విద్యార్థుల మనసు అనే కాన్వాస్ మీద అక్షరాలు లిఖించిన విధాత. విషాదాన్ని కూడా కామెడీ పువ్వులతో అలంకరించడంలో ఆయనకు ఆయనే సాటి.


పాత రోజులు తలుచుకున్నామంటే అందులో చారి సర్ జ్ఞాపకం ఉండాల్సిందే. అసలు ఆయన గుర్తు లేడని ఎవరైనా అంటే వాళ్లు తమ విలువైన బాల్యాన్ని మర్చిపోయారని అర్థం.


అందమైన ఆయన చిరునవ్వు పేద విద్యార్థి  కష్టాన్ని మరిచి పోయేలా చేస్తుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్న చిరంజీవి లాంటి హావభావాలు ప్రదర్శిస్తూ మాతో ఉన్న హీరో అని మేము భావించుకునేలా ఆకట్టుకునే చరిష్మా ఆయనది.

విద్యార్థుల చిరునవ్వు ఆయనకు చాలా ఇష్టం. ఎవరైనా దిగులుగా ఉంటే తరగతి పూర్తైన తర్వాత దగ్గరకు పిలుచుకుని సమస్య అడిగి ఓదార్చడం ఆయన లక్షణం.

దానివల్ల సమస్య తీరదు. సమస్యతో పోరాడటం తెలిసేది. జీవిత మార్గం కూడా అదే కదా ..


తెలుగు పండితుడిగా తెలుగు నేర్పి వెళ్లిపోవడం కాదు ఆయన చేసింది. ప్రతి విద్యార్థి వెలుగు వైపు పయనించేలా  స్ఫూర్తి దాయకమైన కథలు చెప్పేవాడు. కథ చెప్పి వదిలివేయకుండా అలాంటి కథలు విద్యార్థుల చేత రాయించేలా చేసేవాడు. అప్పటికప్పుడు కథలు అల్లి చెప్పడాన్ని ప్రోత్సహించేవాడు. చిన్న చిన్న కవితలు రాయడాన్ని రాసినదాన్ని హావభావాలతో చెప్పడాన్ని నేర్పేవాడు. చిలిపి చేష్టలు చేసే విద్యార్థులను తరగతిలో అందరిముందే తికమక ప్రశ్నలు వేసి అందర్నీ నవ్విస్తూ చివరకు వాళ్ళు కూడా నవ్వేలా చేసేవాడు.

సర్ నవ్వుతో మనం నవ్వు కలిపామా..అంతే ఆయన్ని, పాఠశాలని విడిచేదాకా మనం ఆయన చుట్టూ తిరగవలసిందే. పట్టాభిరామ్ గారి హిప్నాటిజం పుస్తకాల్లో చదివేవాళ్ళం. కొన్నాళ్లకు మర్చిపోయేవాళ్ళం. కానీ చారి సర్ తో  దగ్గరితనం తాలూకు అనుభూతి ఇప్పటికీ విడువలేకపోతున్నాం అంటే అంతగా హిప్నాటైజ్ అయిపోయినం...


కొట్టకుండా, తిట్టకుండా, ఎలాంటి మందలింపు లేకుండా ఇంతమంది విద్యార్థుల మనసుల్లో నిండిపోయిన ఆయన వ్యక్తిత్వం 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయునిగా నాకే అర్థం కాని ఒక ప్రశ్న. మంచి  బోధన చేయడం వేరు. విద్యార్థుల మనసులతో మమేకమై వారికి జీవిత పాఠాలు నేర్పి స్ఫూర్తిని నింపడం వేరు. అలా ఆదర్శప్రాయుడిలా మిగిలి పోయిన గొప్పవాడు చారి సర్.


నా జీవితంపైన  ఆయన ప్రభావం విడదీయలేని ఒక అనుబంధం.  ఆయన ఆత్మీయ స్పర్శ నా జీవితానికి అమృతధార.

ఆఖరి బెంచీలో అల్లరి పిల్లలతో కలిసి ఉన్న నన్ను ఎంత తొందరగా గుర్తించారో అంతే తొందరగా ముందు బెంచ్ కు తీసుకు వచ్చారు. ముందు బెంచి లో స్థానం కల్పించడం అంటే అక్కడ ఉన్న విద్యార్థులను బెదిరించి కాదు..ముందు బెంచ్ కు రావాలంటే అక్కడ ఉన్న విద్యార్థుల తెలివితో పోటీ పడటమే. 


ఆయన ఇచ్చిన స్పూర్తితో 9 వ తరగతిలోనే నెత్తురుదీపం అనే నవల రాశాను. అప్పటి యండమూరి గారి తులసి నవల నాకు ప్రేరణ. 10 వ తరగతిలో దానికి సీక్వెల్ గా  రక్తదీపం రాశాను. ఇంటర్ లో ఓ పావనికథ అనే నవల, డిగ్రీలో సతీ సహగమనం అనే నవలలు రాశాను. ఒక్కో నవల నాలుగు వందల పేజీల నోట్ బుక్ నుండి 1200 పేజీల నోట్ బుక్ లో రాయడం జరిగింది. అన్నీ ఆముద్రితం కావడం తోటి విద్యార్థులు చదవడానికి తీసుకువెళ్లి పోగొట్టడం వల్ల  సతీసహగమనం అనే 1000 పేజీల ఆముద్రిత నవల మాత్రమే  ఇప్పుడు నా దగ్గర మిగిలింది. చారి సర్ ఇచ్చిన స్పూర్తితో నేను రాసే కవితలు, పాటలు, కథలు, నాటికలు కోసం తోటి విద్యార్థులు ఆసక్తి తో ఎదురుచూసేవారు...


ఆ తర్వాత నేను ఉగాది కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాలు, కవి మిత్రులు రాసిన ఎన్నో పుస్తకాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాను. మంచి వ్యాఖ్యాత అని ఓ చిన్న పేరు కూడా ఉంది.


విద్యార్థి జీవితం లో అప్పుడే విరివిగా రాసిన నేను ఉద్యోగ జీవితంలో ప్రవేశించాక ఏమీ రాయలేక పోయాను. అసిఫాబాద్ లో ఒకసారి ఎన్నికల విధుల డ్యూటీ లో కలిసిన సర్ కొత్తగా చేసిన రచనలు  ఏమైనా ముద్రణ కు ఇచ్చావా అని అడిగారు.  ఇవ్వలేదని చెప్పాను.  రాయడం లేదని చెప్పలేక పోయాను.  రాయడం ఎందుకు ఆపేశానో నా దగ్గర క్లారిటీ లేదు. గడ్డ కట్టిన మంచు ఏదో ఒక స్థిరబిందువు నుండి కరగక మానదేమో.....వేచి చూస్తాను.

చారి సర్ అంటే ఒక జ్ఞాపకం కాదు. గుండెలు నింపిన విజ్ఞానం. చారి సర్ అంటే పాఠశాల, గ్రంథాలయం కలబోసి ఆరబెట్టిన ఒక తివాచీ. ఆ తివాచీ ఏ ఒక్కరిదో కాదు.అందరు విద్యార్థులకు అక్కడ సమాన హోదా ఉంటుంది. సర్ అభిమానించే విద్యార్థుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు. అందర్నీ సమఉజ్జీలు గా నిలపాలన్నదే ఆయన తాపత్రయం.


 ముఖ్యంగా సర్ గురించి మాట్లాడుకుంటే ఆయన చేతిరాతను తలుచుకోని వారు ఉండరు. అక్షరాలు గుండ్రంగా కాకుండా తెలుగు అక్షరాలకు ఇన్ని హొయలు ఉంటాయా అని అబ్బుర పరచేలా వ్రాస్తుంటే అలా మైమర్చిపోయి చూస్తుండే వాళ్లం. 

అలా అన్నివిధాలుగా ఆయన అందించిన జ్ఞానం మాకు ఈనాటికి ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతూనే ఉంది.

ఇంటర్ లో అత్యధిక మార్కులు పొందినందుకు స్థానిక  కే కే రావు క్లబ్ వారు నాకు గోల్డ్ మెడల్ బహుకరించినప్పుడు సర్ నన్ను ఆలింగనం చేసుకుని భుజం తట్టిన స్పర్శ తాలూకు అనుభూతి ఇంకా నా హృదయం నుండి చెరిగిపోలేదు. ఆ స్పర్శ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపి అడుగడుగునా తోడుగా నిలిచింది. నా ఒక్కనికే కాదు. నాలాంటి ఎందరో విద్యార్థులకు ఆయన చూపిన దారి మరపురానిది.

ఫిలాసఫీ, సైకాలజీ పెద్ద క్లాసుల్లో చదువుతుంటే ఇవన్నీ( concepts) ఎప్పుడో నేర్చుకున్నాం కదా అనిపించేది.

ఇప్పుడు ప్రతిరోజు తరగతి గదిలో చారి సర్ లాగా పిల్లలతో ఎందుకు మమేకం కాలేకపోతున్నా...అనిపిస్తూనే ఉంటుంది. మంచి సర్ అనే గుర్తింపు అయితే ఉంది కానీ జీవితాంతం మరిచిపోలేని సర్ గా విద్యార్థుల మనసుల్లో నిలిచిఉండటం అంత తేలికైన విషయం కాదు అని తెలుస్తూనే ఉంటుంది.

సర్ తెలుగు ఎంత మధురంగా భోదించేవారో నేను అలా సరళ తరంగా భోదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. విద్యార్థికి ఉపాద్యాయునికి మధ్య ఉండవలసింది బోధనా బంధం కాదు. మానవీయ అనుబంధం ఉండాలి. అలాంటి ఉపాధ్యాయులే మనసు పొరల్లో నిలిచిపోతారు.

ఆ బంధాన్ని విద్యార్థుల హృదయాల్లో  అమరశిల్పి జక్కన లాగా చెక్కాడు చారి సర్.


చల్లని గాలి తెమ్మెర, ఎగసే తరంగాలు, పరవశింప చేసే ప్రకృతి, పసిపాపల చిరునవ్వు , అమ్మ ప్రేమ, హాయి గొలిపే ఆత్మీయత, సేద తీర్చే గానతరంగం..ఇలాంటి పదాల చివర చారి సర్ చెప్పిన పాఠం...చేర్చితేనే ఆ వాక్యాలకు పేర్చే చక్కని అలంకారం అవుతుంది. ఆయన మేధస్సు ను ఏ ఛందస్సు తో పూర్తి చేయలేము.

35 సంవత్సరాల క్రితం మా జీవితాలను ప్రభావితం చేసి ఇటీవలే కీర్తిశేషులు అయిన  రామచంద్రా చారి గారి స్ముత్యర్థం ఆయనతో నాకున్న మానసిక అనుబందం నా జ్ఞాపకాల దొంతరను ఇలా కదిలించింది.. చారి సర్ దగ్గర చదివిన విద్యార్థులకు ఇంతేనా చెప్పడం అనిపిస్తుంది..ఇంకా ఇంకా ఆయన జ్ఞాపకాలు ఎవరైనా ఇలా రాస్తూ పోతుంటే బాగుండు అనిపిస్తుంది. ఆయన గురించి తెలవకుండా ఇది చదివిన వారికి తమ జీవితాలను ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు గుర్తుకు వస్తారు. కన్నవాళ్ళ రుణం ఏదో విధంగా తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ చదువు నేర్పిన గురువులను స్మరించుకోవడం  తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది. 

ఈ రోజుల్లో కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విద్యార్థుల అభివృద్ది కోసం అనితర సాధ్యమైన కృషి సల్పుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారిని తమ మనసు పొరల్లో పదిలంగా దాచుకునే   నాలాంటి శిష్యులు ఉంటూనే ఉంటారు.


అక్కున చేర్చుకున్నారు.అణకువ నేర్పించారు..

అలజడి నిండిన మనసుకి సాంత్వన కలిగించారు..సహనం, నైతిక ప్రవర్తన మేళవింపుతో మమ్మల్ని తీర్చిదిద్దారు.

బడి కాదు అది అమ్మ ఒడి అనే అనుభూతిని మిగిల్చారు

వేదన, రోధన మానేసి మీ బోధనలో పరవశం చెందేలా చేశారు.


 ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నేను చేసే వృత్తిలో

 మరింత అంకితభావం అలవర్చుకోవడం తప్ప.

 

సదా మీ జ్ఞాపకాలతో


మీ

 మునిందర్ రాజు

 గణిత ఉపాద్యాయుడు

 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోథ్

 జిల్లా ఆదిలాబాద్

 9440040744

muninderadluri@gmail.com

తేదీ: 01.08.2020

Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం