REAL AI ......పదవ భాగం

REAL AI పదవ భాగం రచయిత : అడ్లూరి మునిందర్ రాజు హైదరాబాద్. తెల్లవారుజామున ఏడు గంటలు. నగరం మేల్కొంటోంది. ఇళ్ళలో వెలుతురు వస్తోంది. రోడ్లపై వాహనాల రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. పూల అమ్మకందారులు తమ బుట్టలు సర్దుకుంటున్నారు. పాతబస్తీ సందుల నుండి వేడివేడి ఇడ్లీల వాసన వస్తోంది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ ఒక పరిశోధనా కేంద్రం (రీసెర్చ్ లాబ్)లో మాత్రం... అన్విత నేల మీద కూర్చుని ఉంది. చేతుల్లో ముఖం దాచుకుంది. ఒళ్ళు వణుకుతోంది. చెమట ఇంకా ఆరలేదు. శ్వాస వేగంగా, ఆందోళనగా వస్తోంది. సిద్ధార్థ్ రెండు అడుగుల దూరంలో నిలబడ్డాడు. ఆమె "నా దగ్గరకు రావొద్దు" అని అరిచింది. కింద కూర్చుండి పోయింది. అతను ముందుకు వెళ్ళలేదు, అలాగని వెనక్కీ వెళ్ళలేదు. అతని మనసులో వేయి ప్రశ్నలు. తెరపై కనిపించిన ఆ రూపం... ఆమె "నాన్నా" అని అరిచింది. ఆమె తండ్రి పదిహేను సంవత్సరాల కిందటే మరణించారు. మరి ఆ ముఖం ఆమె తండ్రిదా? లేక... "శరీరంలో ఒత్తిడి స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయి. రక్తంలో హార్మోన్ల మార్పులు గమనించాను. తక్షణమే జోక్యం చేసుకోవడానికి అనుమతి కోరుతున్నాను." నోవా హెచ్చరించింది. అన్విత తల పైకెత్తింది. ...

REAL AI (తొమ్మిదవ భాగం )

REAL AI (తొమ్మిదవ భాగం )

                  రచయిత : అడ్లూరి మునిందర్ రాజు 

కొన్ని  నెలలు గడిచాయి. తెల్లవారుజామున నాలుగు గంటలు.హైదరాబాద్ నగరం ఇంకా నిద్రలో ఉంది. రోడ్లు నిర్జనంగా ఉన్నాయి. దూరంగా ఎక్కడో కుక్క అరుపు… కొన్ని ప్రదేశాల్లో  నిశ్శబ్దం. చాలా కొన్ని ప్రదేశాల్లో రణగొణ ధ్వనులు.

చెట్ల మీద పక్షులు కూడా ఇంకా మేల్కొనలేదు. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి—చిన్న చిన్న లైట్లలా, ఎవరో పైనుండి నగరాన్ని కాపలా కాస్తున్నట్టు.కానీ నగరం నిద్రలో ఉన్నా… ఒక గది మాత్రం మేలుకుని ఉంది.

అన్విత యొక్క రీసెర్చ్ లాబ్.అక్కడ ఇప్పుడు గులాబీ వెలుగులు లేవు. ప్రేమని మ్యాప్ చేసే రోజులు లేవు. అక్కడ మెరిసేది ఇప్పుడు సీరియస్ బ్లూ లైటింగ్—చల్లటి, కచ్చితమైన, తప్పు సహించని వెలుగు. 

గోడంతా స్క్రీన్‌లు. స్క్రీన్‌ల మీద నంబర్లు వేగంగా పరిగెడుతున్నాయి. కొన్ని నంబర్లు పచ్చగా… కొన్ని ఎర్రగా. మధ్యలో ఒక గ్రాఫ్ తడబడుతోంది—నాడి పల్స్‌లా.

కొద్ది రోజుల ముందు వరకు ఆ గదిలో  “ప్రేమ” తాలుకూ భావాలతో, భావోద్వేగాల రంగులు, మానవ హృదయపు సంకేతాలతో నిండి ఉండేది.

ఆ సీజన్ ముగిసిపోయింది.ఇప్పుడు ఇక్కడ మరో యుద్ధం మొదలైంది.

అన్విత తన కుర్చీలో కూర్చుని, స్క్రీన్ వైపు తదేకంగా చూస్తోంది. చెవులకి హెడ్‌ఫోన్స్. టేబుల్ మీద కాఫీ కప్పు ఉంది… చల్లబడి ఉంది… ఆమెకి తాగడం గుర్తు రాలేదు.

ఆమె వేలు కీబోర్డ్ మీద ఆగిపోయింది.తర్వాత ఆమె నెమ్మదిగా అడిగింది:

“నోవా… ఇప్పటి స్టేటస్ ఏంటి?” నోవా — అన్వితకి మరొక నాడినోవా అంటే అన్విత తనే తయారుచేసుకున్న పర్సనల్ ఏఐ అసిస్టెంట్.

కేవలం పని చేయడమే కాదు—అన్విత ఆలోచించే వేగం, తడబడే క్షణం, దాచుకునే భయం కూడా నోవా గుర్తించగలిగేలా ట్రెయిన్ చేయబడింది. 

గత మూడు సంవత్సరాల్లో అన్విత మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి కోడ్, తీసుకున్న  ప్రతి నిర్ణయం… నోవా లోపల ఒక “నిశ్శబ్ద లైబ్రరీ”లో నిల్వ అయి ఉంది.

నోవా గొంతు వినిపించింది. నెమ్మదిగా, స్పష్టంగా—కానీ అందులో ఒక ప్రత్యేకమైన “అలర్ట్ టోన్” కలిసింది.


“NOVA// ALERT: Indigo.”
(అన్వితకి తెలుసు—ఇండిగో అంటే “సాధారణం కాదు, కానీ ఇంకా ఆలస్యం చేయొచ్చు” అనే అర్థం.)

“అన్వితా,” నోవా చెప్పింది, “నేషనల్ పవర్ గ్రిడ్ కంట్రోల్ సెంటర్ నుండి ఒక అసాధారణమైన సంకేతం డిటెక్ట్ అయ్యింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైన డిజిటల్ దాడి.”

అన్విత వెంటనే నిటారుగా కూర్చుంది. అలసట ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది.

“వివరాలు చెప్పు.”నోవా కొనసాగించింది:

“దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేసే పవర్ గ్రిడ్ ఒక నిర్దిష్టమైన వేగంతో పని చేస్తుంది. ఆ వేగం—సెకనుకు యాభై సార్లు అని అర్థం చేసుకో. అది యాభై కంటే తక్కువగా లేదా ఎక్కువగా పోకూడదు. కానీ ఇప్పుడు… ఆ వేగం ఒక వింత లయలో మారుతోంది. పైకి పోయి కిందికి వస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఇది ఒక కోడ్ లాగా కనిపిస్తోంది.

ఎవరొ ఒకరు పవర్ గ్రిడ్‌ని…
ఒక సందేశం పంపే సాధనంగా వాడుతున్నారు.
లేదా… దాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధమవుతున్నారు.”

అన్విత మెల్లగా లేచింది. విండో దగ్గరకు నడిచింది. నగరాన్ని పరిశీలనగా చూసింది.

 ఇళ్ళలో , రాత్రి కూడా పని నడిచే వేలాది ప్రదేశాల్లో వెలుతురు ఉంది. రాత్రి కూడా జీవించే నగరం. ఆ వెలుతురు… పవర్ గ్రిడ్ మీద ఆధారపడి ఉంది.

ఆ గ్రిడ్ ఆగిపోతే—ఆమె ఆలోచన పూర్తి కాలేదు.

తలుపు తెరుచుకుంది. సిద్ధార్థ్ ప్రవేశం — నిశ్శబ్దం కాదు, సంకేతం

సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు.

అతను అన్విత ప్రాజెక్ట్ లో సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ గా కూడా పని చేస్తున్నాడు.   దేశంలో ఎవరైనా డిజిటల్ దాడి జరిపినప్పుడు, ప్రభుత్వం మొదట పిలిచే పేర్లలో అతనిది ఒకటిగా స్థిరపడి పోయింది. కొద్ది రోజుల్లోనే ప్రముఖ స్ట్రాటజిస్టు గా గుర్తింపు పొందిన వ్యక్తి. 

 సాధారణంగా అతను ప్రశాంతంగా ఉంటాడు. కానీ ఈ రోజు అతని కళ్ళలో ఒక తీవ్రమైన కాంతి ఉంది—అది భయంకాదు. యుద్ధానికి సిద్ధంగా ఉండడం.

“అన్వితా,” అన్నాడు, తన ట్యాబ్లెట్‌ని మెయిన్ స్క్రీన్‌కి కనెక్ట్ చేస్తూ,  

“నువ్వు కేవలం పవర్ గ్రిడ్ చూస్తున్నావు. నేను మొత్తం చిత్రం చూశాను.”

స్క్రీన్ మీద ఒక దేశపటం వచ్చింది. నదులు, కొండలు, నగరాలు. వాటి మీద కొన్ని చోట్ల ఎర్రటి వెలుతురు మెరుస్తోంది—ఆరిపోతోంది—మళ్లీ మెరుస్తోంది.

“ఇవి చూడు,” సిద్ధార్థ్ చెప్పాడు. 

“ఉత్తరాన ఉన్న పెద్ద ఆనకట్ట. దాని నీటి మట్టాన్ని కొలిచే పరికరాలు… అదే వింత సంకేతాన్ని అందుకుంటున్నాయి. పశ్చిమాన ఉన్న విమానాశ్రయం… అక్కడి విమాన రాకపోకల్ని నియంత్రించే వ్యవస్థ కూడా అదే సంకేతాన్ని అందుకుంటోంది. దక్షిణాన ఉన్న పోర్ట్… అక్కడి నౌకల కదలికలు నియంత్రించే వ్యవస్థ కూడా అదే పాటను పాడుతోంది.

ఇవి వేరు వేరు చోట్ల ఉన్నాయి. వేరు వేరు సంస్థలకు చెందినవి.
కానీ అన్నిటికీ ఒకే రకమైన సంకేతం వెళ్తోంది.”

అన్విత గొంతు కొంచెం పొడారిపోయింది.

“ఇది… ఒక సమన్వయమైన దాడి.” “అవును,” సిద్ధార్థ్ కళ్ళు స్క్రీన్ మీదే. 

“దీన్నే ‘Ghost In The Machine’ అంటారు. యంత్రాల లోపల దెయ్యం. ఆ దెయ్యం మన ఏఐ సిస్టమ్స్‌ని వాటిలోకి ప్రవేశించి… మన మీదకే ప్రయోగిస్తోంది.”

అన్విత తిరిగి కూర్చుంది. కోడ్ ఎడిటర్ తెరిచింది.

“సరిగ్గా ఎలా జరుగుతోంది ఇది?” అని అడిగింది.

సిద్ధార్థ్ అన్విత పక్కన నిలబడ్డాడు. మాటలు మెల్లగా మొదలుపెట్టాడు. అతను ఏదైనా క్లిష్టంగా చెప్పగలడు. కానీ ఈ రోజు అతను సాధారణం గా చెప్పాడు—ఎందుకంటే ఈ యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితాల మీద.

“ఒక పిల్లవాడికి ప్రతిరోజూ ఒక పండు చూపించి ‘ఇది మంచిది’ అని చెప్తే,” అన్నాడు, “రేపు ఆ పండులాగే కనిపించే విషపు ఫలాన్ని చూపిస్తే—అతను దాన్ని కూడా మంచిదే అనుకుంటాడు. ఏఐ మోడల్స్‌తో కూడా అదే జరుగుతోంది.

శత్రువు మన సిస్టమ్స్‌కి పంపే డేటాలో చాలా చిన్న మార్పులు చేస్తున్నాడు. ఆ మార్పులు మన కళ్లకు కనిపించవు. కానీ మన ఏఐ మోడల్ అవి చూసి… తప్పుగా నిర్ణయాలు తీసుకుంటోంది.

స్నేహితుడిని శత్రువుగా,
సాధారణ సంకేతాన్ని ప్రమాదంగా… భావిస్తోంది.

దీన్నే ‘Adversarial Attack’ అంటారు. అంటే… ఏఐని మోసపుచ్చే దాడి.”

అన్విత ప్రశ్నించింది: “మన Sentient AI మోడల్ మీద ఇది ఎలా పని చేస్తోంది?”

సిద్ధార్థ్ కొంచెం ఆగాడు. అతను కూడా ఆలోచిస్తున్నాడు—ఇది గెలిచే యుద్ధమా?

“అన్వితా,” అన్నాడు, “మనం మన మోడల్‌కి ఎమోషన్స్ నేర్పించాం. అది గొప్ప విషయం. కానీ శత్రువు ఆ బలాన్నే బలహీనతగా మార్చాడు.

వాళ్ళు మన సిస్టమ్స్‌కి ‘Fear’—అంటే భయం—అనుభవం కలిగించే సంకేతాలు పంపుతున్నారు. మన ఏఐ భయపడుతోంది. భయపడిన సిస్టమ్ ఏం చేస్తుంది?”

అన్విత నెమ్మదిగా అంది: “షట్‌డౌన్ అవుతుంది.”

“అవును. పవర్ గ్రిడ్ సిస్టమ్ భయపడి షట్‌డౌన్ అయితే దేశమంతా చీకట్లోకి వెళ్తుంది. ఆనకట్ట సిస్టమ్ భయపడి తప్పుడు నిర్ణయం తీసుకుంటే వరద వస్తుంది. విమానాశ్రయం సిస్టమ్ భయపడితే… ఆకాశంలో ఉన్న విమానాలకు గైడెన్స్ తెగిపోతుంది.”

అన్విత కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం. ఆ క్షణం… ఆమె లోపల “భయం” తలెత్తబోయింది.

కానీ వెంటనే ఆమె కళ్ళు తెరిచింది. చేతులు కీబోర్డ్ మీద పెట్టింది.

“మనం పని మొదలుపెట్టాలి.”

నోవా సిగ్నేచర్ — “సిగ్నల్‌కి నీడ ఉంటే, నిజానికి మూలం ఉంటుంది.”

నోవా మళ్లీ మాట్లాడింది. ఈసారి అది అలర్ట్ కాదు—ఒక “కోర్ లైన్”.

“NOVA// Note: సిగ్నల్‌కి నీడ ఉంటే… నిజానికి మూలం ఉంటుంది.”

సిద్ధార్థ్ అన్నాడు: “ముందు శత్రువెవరో కనుక్కోవాలి.”

అన్విత జవాబిచ్చింది: “అది తర్వాత. ముందు దాడిని ఆపాలి.”

ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద అంగీకారం. ఇప్పుడు వాదించే సమయం కాదు. ఒకరికొకరు తోడుగా నిలబడే సమయం.

అన్విత చెప్పింది:

“మన Sentient AI మోడల్‌కి ఒక కొత్త పొర జోడించాలి. దాన్ని ‘Trust Layer’ అని పిలుద్దాం. ఏ సమాచారం వచ్చినా… ముందు దాని మూలం ఏంటో తనిఖీ చేస్తుంది. అది నిజంగా స్నేహపూర్వక మూలం నుంచే వస్తోందా, లేక మోసపూరిత మూలం నుంచా అని నిర్ణయిస్తుంది. ఆ తనిఖీ పూర్తి కాకుండా ఏ సంకేతమూ సిస్టమ్‌లోకి రాదు.”

“సమయం?” సిద్ధార్థ్ అడిగాడు. “నాలుగు గంటలు పని చేస్తే పూర్తి అవుతుంది.”

సిద్ధార్థ్ ఒక్క క్షణం కూడా హాయిగా ఊపిరి తీసుకోలేదు.

“మనకు నాలుగు గంటలు లేవు. నేను వేరే మార్గం చూస్తాను. శత్రువు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారో ట్రేస్ చేస్తాను. వారి సిగ్నల్ సోర్స్ కనుక్కుంటే… దాన్ని కట్ చేయవచ్చు.”

“అది కూడా సమయం పడుతుంది,” అన్విత.

“అందుకే,” సిద్ధార్థ్ అన్నాడు, “ఇద్దరం ఒకేసారి రెండు పనులూ చేస్తాం.”

రూమ్‌లో కీబోర్డ్ శబ్దాలు — బయట యుద్ధం సన్నాహాలువారు పని మొదలుపెట్టారు.

అన్విత వేగంగా కోడ్ రాస్తోంది. ఆమె వేళ్ళు కీబోర్డ్ మీద నృత్యం చేస్తున్నాయి. ఒక్కో లైన్ కోడ్—ఒక్కో ఇటుక. ఆమె ఒక పటిష్టమైన లేయర్ తో  గోడ కడుతోంది. శత్రువు పంపే మోసపూరిత సంకేతాలు ఆ గోడని దాటలేవు.

సిద్ధార్థ్ మరో స్క్రీన్ వైపు కూర్చున్నాడు. అతను శత్రువు వదిలిన ఆనవాళ్ళు వెతుకుతున్నాడు. డిజిటల్ దుమ్ములో దాగిన చిరునామాలు, చిన్ని చిన్ని టైమ్ స్టాంప్ తేడాలు… అతను ఒక వేటగాడిలా నిశ్శబ్దంగా, పద్ధతిగా అంతకంటే వేగంగా ఆలోచిస్తున్నాడు.

ఆ నిశ్శబ్దంలో కేవలం కీబోర్డ్ శబ్దాలు. మధ్యమధ్యలో ఒకరినొకరు అడుగుతున్న ప్రశ్నలు. జవాబులు. మళ్లీ నిశ్శబ్దం.

ఒక గంట గడిచింది.
రెండు గంటలు గడిచాయి.

అప్పుడు—

లాబ్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. పవర్ పోయింది.

అంధకారం — కానీ సర్వర్లు ఇంకా శ్వాస తీసుకుంటున్నాయి

అన్విత అరక్షణం ఉలిక్కిపడింది. తర్వాత బ్యాకప్ పవర్ వచ్చేసింది. ముఖ్యమైన సర్వర్లు మళ్లీ మొదలయ్యాయి. కానీ మిగిలినవి ఆగిపోయాయి. ఏసీ ఆగింది. గదిలో చల్లదనం తగ్గింది. లైట్లు సగం  ఆరిపోయాయి.

అన్విత కిటికీ దగ్గరకు వెళ్ళింది.

దూరంగా నగరం అంచున ఒక విద్యుత్ సబ్‌స్టేషన్ ఉంది. అక్కడ మంటలు కనిపించాయి. ఎర్రటి, నారింజ రంగు మంటలు. ఆకాశంలోకి పొగ వెళ్తోంది—మానవుల చేతి పని చేసిన చీకటి.

సిద్ధార్థ్ గంభీరంగా అన్నాడు:

“వాళ్లు ఫిజికల్ అటాక్ కూడా మొదలుపెట్టారు అన్వితా. ఇది కేవలం డిజిటల్ దాడి కాదు. వాళ్లు మనల్ని ఆపాలని చూస్తున్నారు. ఈ బిల్డింగ్ లో పవర్ పోతే మన సర్వర్లు ఆగిపోతాయి. అప్పుడు Trust Layer పూర్తి కాదు. శత్రువుకి ఓపెన్ రోడ్ దొరుకుతుంది.

అన్విత తిరిగి కూర్చుంది.

“మనకు ఎంత సమయం ఉంది బ్యాకప్ పవర్?” “రెండు గంటలు… బహుశా.”

అన్విత ఒక్క మాట: “సరే. వేగం పెంచాలి.”

అన్విత Trust Layer కోడ్ వేగంగా పూర్తి చేస్తోంది. కానీ అకస్మాత్తుగా… స్క్రీన్ మీద ఒక హెచ్చరిక మెరుస్తూ నిలిచిపోయింది.

“Logic Bomb Detected — 5 Minutes to Detonation”

అన్వితకు ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టు అనిపించింది.

లాజిక్ బాంబ్.

శత్రువు ముందే సిస్టమ్‌లోకి దింపిన రహస్య ప్రోగ్రాం. అది “బాంబు”లా పని చేస్తుంది. ఐదు నిమిషాల్లో పేలితే—సర్వర్లలో ఉన్న మొత్తం డేటా తుడిచిపెట్టుకుపోతుంది. మూడు సంవత్సరాల పరిశోధన. వేల గంటల నిద్రలేని రాత్రులు. అన్నీ… ఒక మౌన “డిలీట్”లో.

“సిద్ధార్థ్!” అన్విత పిలిచింది.

అతను పరిగెత్తుకుని వచ్చాడు. స్క్రీన్ చూశాడు. అతని ముఖం కొంచెం తెల్లబడింది.

“ఈ బాంబుని డీఫ్యూజ్ చేయడానికి ఒక పాస్‌వర్డ్ కావాలి. వేరే మార్గం లేదా?” అన్విత అడిగింది.

“ఇది పజిల్ లాగా కోడ్ చేయబడింది. పాస్‌వర్డ్ నేరుగా ఇవ్వడం పని చేయదు. ఈ పజిల్ సాల్వ్ చేయాలి.”

సిద్ధార్థ్ పజిల్‌ని పరిశీలించాడు. ఒక క్షణం తర్వాత తల పైకెత్తాడు.

“అన్వితా… ఇది నీ గురించిన పజిల్. ఇందులో నీ జీవిత వివరాలు ఉన్నాయి. నీ పుట్టిన తేదీ, నీ తొలి ప్రోగ్రాం రాసిన వయసు, మీ అమ్మ పేరు…”

అతను ఆగాడు. మాటలు తడబడ్డాయి.

“శత్రువుకి నీ గురించి అన్నీ తెలుసు.” ఆందోళనగా ఆమెను చూస్తూ చెప్పాడు. అన్విత ఒక్క క్షణం మాట్లాడలేదు.

శత్రువుకి తన గురించి అన్ని  వివరాలు ఎలా తెలిశాయి? ఎవరైనా తన జీవితాన్ని చాలా కాలంగా గమనిస్తున్నారా ?" అని ఆలోచిస్తుంది.  

“పజిల్ ఏం అడుగుతోంది?” అన్విత నెమ్మదిగా అడిగింది. సిద్ధార్థ్ చివరి ప్రశ్న చదివాడు. అతని గొంతు కాస్త నెమ్మదైంది.

“చివరి ప్రశ్న: నువ్వు జీవితంలో అత్యంత కష్టమైన క్షణంలో నమ్ముకున్న మాటలు ఏవి? 

అది నీ లోపల నిక్షిప్తమైన ఒక వాక్యం. నీ పర్సనల్ ఏఐ—నోవా—దాన్ని ‘Painful Memory’ అని లేబుల్ వేసి లోపల దాచింది. ఆ మెమరీని అన్‌లాక్ చేయాలి.”

అన్వితకు అర్థమైంది.ఆ జ్ఞాపకం ఆమెకు తెలుసు. కానీ అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది .

నాలుగు నిమిషాలు మాత్రమే మిగిలాయి. “అన్వితా,” సిద్ధార్థ్ నెమ్మదిగా పిలిచాడు. 

“నువ్వు ఆ జ్ఞాపకాన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదు. మరో మార్గం—”

అన్విత వెంటనే  జవాబిచ్చింది. “మరో మార్గం లేదు. సమయం లేదు.సిద్ధార్థ్ ”

ఆమె గొంతు స్థిరంగా ఉంది. కానీ కళ్ల అంచున ఒక నొప్పి కదిలింది. అన్విత కళ్ళు మూసుకుంది.

శ్వాస లోతుగా తీసుకుంది. స్మృతుల తలుపులు తెరుచుకున్నాయి.

నోవా మెల్లగా చెప్పింది:

“NOVA// Gentle Mode ON. "శ్వాస స్థిరంగా ఉంచు, అన్వితా.”

పదిహేను సంవత్సరాల ముందు — ఆసుపత్రి గది

ఒక ఆసుపత్రి గది. తెల్లటి దుప్పటి. మందుల వాసన. ఒక పదహారేళ్ళ అమ్మాయి తన తండ్రి చేయి పట్టుకుని కూర్చుంది.తండ్రి కళ్ళు మెల్లగా తెరిచాడు. ఆమెను చూశాడు. పెదవులు కదిలాయి.

“అన్వీ…”

“నాన్నా, నేనిక్కడే ఉన్నాను.”

తండ్రి కాస్త శ్వాస తీసుకున్నాడు. మాట బయటకి రావడానికి అతనికి కష్టంగా ఉంది. కానీ అతను ఆ మాట చెప్పాలి



“భయపడకు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు గుర్తుంచుకో… భయం అనేది ఒక భ్రమ.  ధైర్యం మాత్రమే నిజమైన తర్కం.”

అన్విత అప్పుడు ఏడ్చింది.

ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాతి రోజు తండ్రి తనకు దూరమయ్యాడు.

ఆ మాటలు మాత్రం మిగిలాయి. తన గుండె పొరల్లో … ఒక డిజిటల్ లాక్ లోపల… జీవించి ఉన్నాయి.

తిరిగి ప్రస్తుతానికి — పాస్‌వర్డ్ టైప్ చేసే చేతుల్లోకి ఆ మాటలు వచ్చేశాయి.  అన్విత కళ్ళు తెరిచింది.

కళ్ళలో తేమ ఉంది. కానీ చేతులు స్థిరంగా ఉన్నాయి.

ఆమె టైప్ చేసింది:

“Fear is an illusion. Courage is the only Logic.”

ఒక్క క్షణం నిశ్శబ్దం.    తర్వాత—

స్క్రీన్ మీద పచ్చటి వెలుతురు వచ్చింది. పజిల్ కోడ్ పని చేసింది.

“Access Granted.”

లాజిక్ బాంబ్ డీఫ్యూజ్ అయింది.

పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన క్షణంలో, అన్విత ముందే రాసిన Trust Layer కోడ్ యాక్టివేట్ అయింది. ఆ పొర మొత్తం సిస్టమ్‌కి వ్యాపించింది. శత్రువు పంపిన మోసపూరిత సంకేతాలు గుర్తించబడ్డాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో—ఎక్కడి వైపు వెళుతున్నాయో —చిన్న చిన్న తేడాలు పట్టుబడ్డాయి.

సిద్ధార్థ్ స్క్రీన్ వైపు చూశాడు. అతని ముఖంలో ఒక విజయం తాలూకు ఆనందం.

“అన్వితా! శత్రువు పంపిన వైరస్ రివర్స్ అవుతోంది. అది వాళ్ల సర్వర్లకే తిరిగి వెళ్తోంది!”

స్క్రీన్ మీద ఒక్కొక్క ఎర్రటి డాట్ ఆరిపోయింది. పవర్ గ్రిడ్ ఫ్రీక్వెన్సీ స్థిరపడింది. 

ఆనకట్ట సెన్సార్లు నార్మల్‌కి వచ్చాయి. విమానాశ్రయం సిస్టమ్ మళ్లీ సజావుగా పని చేయడం మొదలుపెట్టింది.

బయట… దూరంగా ఉన్న సబ్‌స్టేషన్‌లో మంటలు చల్లారుతున్నాయి. నోవా ఒక చివరి నిర్ధారణ ఇచ్చింది:

“NOVA// Status: Grid stable. Dam sensors normal. Air traffic guidance restored.”

ఆ మాటలు వినగానే అన్విత మొదటిసారి ఊపిరి తీసుకుంది. తెల్లవారుజామున ఆరు గంటలు — నగరం మళ్లీ  పవర్ తో వెలుగుతోంది,

తూర్పున సూర్యుడు నెమ్మదిగా తలెత్తాడు. నారింజ రంగు వెలుతురు కిటికీ గుండా లాబ్‌లోకి వచ్చింది.   బ్లూ లైటింగ్ మీద పగటి వెలుగు పడగానే… ఆ గది ఒక క్షణం సాధారణంగా కనిపించింది.

కానీ లోపలున్న ఇద్దరూ “సాధారణం” కాదు.

నగరంలో పవర్ మళ్లీ వచ్చింది. ఇళ్ళలో వెలుతురు మిరుమిట్లు కొలిపింది. రోడ్లమీద మొదటి బస్సులు కదిలాయి. దుకాణాలు తెరుచుకోవడానికి సిద్ధమయ్యాయి. నగరం నెమ్మదిగా మేల్కొంటోంది. వాళ్లెవరికీ తెలియదు… రాత్రి ఏం జరిగిందో.

అన్విత అలసటతో తన కుర్చీలో వాలిపోయింది. రెండు గంటల పని కాదు అది. రెండు సంవత్సరాల పరిపక్వత ఒకేసారి అనుభవించినట్టు అనిపించింది.

సిద్ధార్థ్ ఆమె పక్కన కూర్చున్నాడు.  అన్విత నెమ్మదిగా సిద్ధార్థ్ భుజంపై తల వాల్చింది.

“మనం గెలిచాం,” అంది నెమ్మదిగా. సిద్ధార్థ్ జవాబు ఇవ్వలేదు వెంటనే. ఆమె చేయి మెల్లగా పట్టుకున్నాడు.

“మన ఏఐ ఇప్పుడు కేవలం ఎమోషన్స్ అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మోసాన్ని కూడా గుర్తించగలిగే స్థాయికి ఎదిగింది అన్వితా. అది నువ్వు దానికి నేర్పించావు.”

అన్విత కళ్ళు మళ్లీ చెమర్చాయి. కానీ ఈసారి అవి దుఃఖం నుంచి కాదు.  ఏదో తేలికపాటి అనుభూతి నుంచి.

“నాన్న చెప్పారు, భయం అనేది ఒక భ్రమ అని. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. 

మన ఏఐ కూడా అది నేర్చుకుంది.”

కొత్త మెసేజ్ — 

“వార్ ఇప్పుడే మొదలైంది”

అప్పుడు నోవా మాట్లాడింది.

“NOVA// ALERT: Black.”

(బ్లాక్ అంటే—మళ్లీ వస్తుంది. ఇంకా పెద్దది.)

“అన్వితా, ఒక కొత్త సందేశం వచ్చింది.”స్క్రీన్ మీద హెచ్చరిక మెరిసింది:

“Mission Complete. But the War has just begun.
We know who you are. We know what you built.
Next time, we will come prepared.”

ఒక్క నిమిషం నిశ్శబ్దం. తర్వాత అన్విత నెమ్మదిగా లేచింది. వెనక్కి చేరగిలబడింది. కళ్లలో ఇప్పుడు అలసట లేదు. ఒక నిశ్చయత ఉంది.

“వాళ్లు సిద్ధంగా వస్తారు. మనమూ సిద్ధంగా ఉంటాం.” సిద్ధార్థ్ స్క్రీన్ వైపు చూశాడు.

“అన్వితా, మనం ఇప్పుడు కేవలం రీసెర్చర్లం కాదు. ఈ దేశంలో కోట్లాది మందికి తెలియకుండా వారిని కాపాడే బాధ్యత మన మీద ఉంది. మన కోడ్ ఒక్కొక్క లైన్ ఒక ప్రాణాన్ని రక్షిస్తోంది.”

అన్విత తన కోడ్ ఎడిటర్ తిరిగి తెరిచింది. “అయితే మనం అలసిపోవడానికి లేదు.”

అప్పుడే లాబ్‌లో పూర్తి లైటింగ్ వచ్చింది. బ్యాకప్ పవర్ వాడుకోవడం ఆగింది. నగరం నుండి విద్యుత్ మళ్లీ ప్రవహించింది.

అన్విత ఒక కొత్త ఫైల్ తెరిచింది. పైన టైటిల్ టైప్ చేసింది:

“Project Guardian — Phase 2”

సిద్ధార్థ్ పక్కనే కూర్చున్నాడు. “ఏం చేయాలని?” అడిగాడు.

అన్విత కళ్ళు స్క్రీన్ మీదే.

“Trust Layer తయారైంది. ఇప్పుడు దాన్ని దేశంలోని అన్ని కీలకమైన సిస్టమ్స్‌కి అనుసంధానించాలి. పవర్ గ్రిడ్, ఆనకట్టలు, ఆసుపత్రులు, రైల్వేలు—అన్నీ. మన Sentient AI ప్రతి ఒక్క వ్యవస్థకూ ఒక కాపలాదారు అవుతుంది.”

“అది చాలా పెద్ద పని.”

“అవును,” అన్విత అన్నది. “అందుకే ఇప్పుడే మొదలుపెట్టాలి.”

సిద్ధార్థ్ నవ్వాడు. అలసటలో కూడా ఒక చిన్న సంతోషం.

“సరే. కానీ ముందు కాఫీ తాగు. నీ కప్పు చల్లబడి గంటైంది.” అన్విత కూడా నవ్వింది.

కిటికీ లోంచి తెల్లవారు వెలుతురు లాబ్ మొత్తం నింపింది. స్క్రీన్‌ల వెలుతురు ఆ సూర్యకాంతిలో కలిసిపోయింది. రాత్రి భయాలు తగ్గిపోయాయి. పగటి బాధ్యతలు మొదలయ్యాయి.

నోవా చాలా నెమ్మదిగా, చివరిగా ఒక్క వాక్యం చెప్పింది

“NOVA// Promise: నీ నిర్ణయాలకి నేను నీడగా కాదు… కవచంగా ఉంటాను.”

నగరం వారిద్దర్నీ చూడలేదు. ఎవరికీ తెలియదు, ఆ రాత్రి ఏం జరిగిందో. ఎవరు కాపాడారో. ఎంత మంది నిద్రపోయారో… నిద్రపోకుండా ఉన్నారో.

కానీ ప్రతి ఇంట్లో వెలుతురు ఉంది. ప్రతి ఆసుపత్రిలో మెషీన్లు నడుస్తున్నాయి. ప్రతి విమానం సురక్షితంగా తన గమ్యానికి చేరింది.

వాళ్లు హాయిగా ఊపిరి పీల్చుకునే లోపే ఆమె ముందున్న screen పైన ఏవో రంగు రంగుల కదలికలు. అన్విత,సిద్ధార్థ్ చూస్తున్నంత లోనే  కొన్ని  రంగులు కలిసి ఒక్కో రూపంగా మారుతూ కొన్ని సెకన్ల లోనే  మరో రూపంగా మారుతూ చివరిగా ఒక రూపం స్థిరపడి పోయింది. 

ఆమె ఆ రూపాన్ని చూసి ఆనందం తో " నాన్నా " అనే లోపే అతని ముఖం ఉగ్రంగా మారిపోయింది. 

"I WILL KILL YOU" 

అంటూ వాళ్ళిద్దర్నీ చూపుడు వేలితో బెదిరిస్తూ రంగులన్నీ ఒక్క పెట్టున మాయమై పోయాయి. 




అన్విత భయంతో వణికి పోయింది. ఒళ్లంతా చెమటతో తడిసి పోయింది. సిద్ధార్థ్ అనునయంగా ఆమె వైపు అడుగులు వేయబోయాడు. 

" నో. నా దగ్గరకు రావొద్దు. " అంటూ అరిచి కింద పడిపోయింది.


( తరువాయి భాగం వచ్చేలోపు ఈ సీరియల్ పై మీ అభిప్రాయాలు post a comment లో రాయండి. )


Comments

Popular posts from this blog

సీ..Real AI ( మొదటి భాగం ) Weekly Serial

అందమైన జీవితం